GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 4:34 pm Posted by : GURU SWAMY

ట్రిపుల్ ఐటీ కలలపై ప్రమాదం నీడ.. తేజస్వినికి న్యాయం చేయాలి..

గరుడధాత్రి :
సత్యవేడు మండలం మాధనపాలెంకు చెందిన ఆర్. తేజస్విని జీవితాన్ని మార్చే రోజుగా భావించిన జూన్ 22, ఆమె కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. పదో తరగతిలో 573 మార్కులు సాధించి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించిన తేజస్విని, కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు తల్లిదండ్రులతో కలిసి బయలుదేరగా రాజంపేట సమీపంలోని పుల్లంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం వారి ఆశలపై నీళ్లు చల్లింది.
లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో తేజస్వినికి రెండు చేతివేళ్లు తెగిపోవడంతో పాటు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు కూడా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. కౌన్సిలింగ్ హాల్‌లో ఉండాల్సిన విద్యార్థిని, ఆసుపత్రి మంచంపై నొప్పితో విలవిల్లాడుతుండటం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
పేద కుటుంబానికి చెందిన తేజస్విని తన కష్టపడి చదివి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. అయితే అనుకోని ప్రమాదం కారణంగా కౌన్సిలింగ్‌కు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
తేజస్విని సాధించిన అర్హతను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యేక పరిస్థితిగా భావించి ఆమె విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే ప్రత్యేక కౌన్సిలింగ్ లేదా ప్రత్యామ్నాయ విధానం ద్వారా ఆమెకు సీటు కేటాయించేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రమాదం ఆమె శరీరాన్ని గాయపరిచింది కానీ ఆమె ప్రతిభను, ఆశయాలను కాదు. తేజస్విని కలలు సాకారం కావాలంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాల్సిన సమయం ఇది.