అరుణోదయ డప్పు కళాకారుల సంఘం డిమాండ్
సత్యవేడు, మే 28 గరుడధాత్రి:
సత్యవేడు మండలంలో ఉన్న అర్హత కలిగిన డప్పు కళాకారులందరికీ నెలకు రూ.7,000 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని అరుణోదయ డప్పు కళాకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘ నాయకుడు దేశాండీ అరుణాచలం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సత్యవేడు మండలంలోని శిరణంబుదూరు దళితవాడలో డప్పు కళాకారుల సంఘం ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణాచలం మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం డప్పు కళాకారులకు కొత్త పింఛన్లు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, డప్పులు, దుస్తులు, గజ్జెలు అందజేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు హామీల అమలులో పురోగతి కనిపించలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా డప్పు కళాకారులు గ్రామ సచివాలయాల నుండి జిల్లా కలెక్టర్ల వరకు అనేకసార్లు ఆందోళనలు చేపట్టిన ఫలితంగా జూన్ నెల నుండి కొత్త పింఛన్ల మంజూరుపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో డప్పు కళాకారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త పింఛన్ల మంజూరులో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే 2019 సంవత్సరం తర్వాత సత్యవేడు మండలంలోని డప్పు కళాకారులకు డప్పులు, గజ్జెలు, దుస్తులు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు.
కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జూన్ నెలలోనే అర్హులైన డప్పు కళాకారులకు కొత్త పింఛన్లు, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో డప్పు కళాకారులు ధనంజయన్, వెంకటయ్య, కుప్పన్, జయరామన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.