సత్యవేడు జూన్ 22 గరుడధాత్రి :
సత్యవేడు మండల పరిధిలో తరతరాలుగా డప్పు కళపైనే ఆధారపడి జీవిస్తున్న డప్పు కళాకారులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, వారికి అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మరియు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు సత్యవేడు డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వర్లుకు గారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించి,మండలంలోని అర్హులైన 150 మంది డప్పు కళాకారుల అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్, కెవిపిఎస్ సత్యవేడు మండల గౌరవ అధ్యక్షులు మెలుగు రమేష్ లు మాట్లాడుతూ.. సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న డప్పు కళను నమ్ముకున్న కళాకారులు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యవేడు మండలంలోని అర్హులైన డప్పు కళాకారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు అందాలంటే తక్షణమే గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి అర్హులైన ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు మురళి, వ్యవసాయ కార్మిక సంఘ మండల అధ్యక్షులు కిష్టయ్య మరియు సత్యవేడు మండలానికి చెందిన శిరణంబూదురూ, మదనంజేరి, ఆంభాకం, ఆరూరు, రాజగోపాలపురం, వెంకటాపురం, కాపుకండిగ, చెరివి, చంగంబాకం, ఇరుగుళం, కొల్లడం గ్రామాలకు చెందినటువంటి డప్పు కళాకారుల సంఘ నాయకులు, ఆయా గ్రామాల డప్పు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతిపత్రం సమర్పించారు.