GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 8:21 am Posted by : GARUDA DHATRI NEWS

తడ అపార్ట్మెంట్స్ నిర్లక్ష్యంతో దుర్గంధంలో రాచకండ్రిగ వీధులు గ్రామస్తుల వినతులను పట్టించుకోని అధికారులు

తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం పరిధిలోని రాచకండ్రిగ గ్రామంలో తడ అపార్ట్మెంట్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్స్ నుంచి వెలువడుతున్న డ్రైనేజీ మురుగునీటిని యథేచ్ఛగా గ్రామ రోడ్లపైకి వదిలేయడంతో వీధులన్నీ మురుగునీటితో నిండిపోయి దుర్గంధభరితంగా మారాయి.రోడ్లపై నిల్వ ఉన్న మురుగునీటి వల్ల గ్రామస్తులు, పాదచారులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ దారుల్లో సంచరించేందుకు భయపడుతున్నారు. దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసమస్యపై పలుమార్లు స్థానిక ఎంపీడీవో, గ్రామ సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అపార్ట్మెంట్ నిర్వాహకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ఉన్నారనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ముడుపుల కారణంగానే అపార్ట్మెంట్స్ నుంచి విడుదలవుతున్న మురుగునీరు తడ మండలం నుంచి రాచకండ్రిగ వీధుల్లోకి ప్రవహిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, రోడ్లపై మురుగునీటిని వదిలేస్తున్న అపార్ట్మెంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.