సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డి. కిరణ్ కుమార్
తడ, సెప్టెంబర్ 12 (గరుడధాత్రి):
తడ మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డి. కిరణ్ కుమార్ మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కొరత, పారిశుద్ధ్య లోపం, వీధి దీపాలు వెలగకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా అనపగుంట గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
అలాగే ఇరకం గ్రామ పంచాయతీలో నీటి సరఫరా నిర్వహిస్తున్న సిబ్బందికి గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించలేదని కిరణ్ కుమార్ తెలిపారు. దీంతో సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం వల్ల గ్రామంలో తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతోందని వివరించారు.
ప్రజా సమస్యలపై కిరణ్ కుమార్ చేసిన ఫిర్యాదులపై ఎంపీడీవో సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు ఫోన్ చేసి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా నీటి సరఫరా సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాల బకాయిలను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంభాకం హరికృష్ణ, జిల్లా కిసాన్ విభాగం అధ్యక్షులు జోగి వినోద్, సూళ్లూరుపేట మండల కార్యదర్శి బొగ్గుల సురేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.