GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 7:13 am Posted by : GARUDA DHATRI NEWS

తడ సౌత్ కేబిన్ వద్ద ఆర్‌యూబీ నిర్మాణం కోసం ఎంపీ గురుమూర్తి వినతి

గరుడధాత్రి న్యూస్ :
సూళ్లూరుపేట నియోజకవర్గం, తడ దక్షిణ క్యాబిన్ వద్ద రైళ్ల రాకపోకల కారణంగా లెవెల్త క్రాసింగ్ర గేటు తరచుగా మూసివేయడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక నాయకులు మంగళవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసి తమ సమస్యను వివరించి వినతిపత్రం సమర్పించారు.
ఈ సమస్యపై వెంటనే స్పందించిన తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు సంబంధిత రైల్వే శాఖ అధికారులకు లేఖ రాసి, తడ సౌత్ కేబిన్ సమీపంలోని ఎల్‌సీ గేట్ నెం.49 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన లేఖ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం లెవెల్ క్రాసింగ్ గేటు తరచుగా మూసివేయడం కారణంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు కూడా ఎక్కువసేపు గేటు వద్ద నిలిచిపోవాల్సి వస్తోందని తెలిపారు.
అదేవిధంగా శ్రీ సిటీ ప్రాంతానికి ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు రాకపోకల్లో తీవ్ర ఆలస్యం ఎదుర్కొంటున్నారని, దీని ప్రభావం వారి దైనందిన జీవన విధానంపై పడుతోందని పేర్కొన్నారు. గేటు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని, ప్రమాదాల అవకాశాలు కూడా అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణం అవసరమని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సౌకర్యవంతమైన రవాణా దృష్ట్యా తక్షణమే సంబంధిత రైల్వే అధికారులను ఆదేశించి ప్రతిపాదనను పరిశీలించి ఆర్‌యూబీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.