GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:37 am Digital Edition : GURU SWAMY

తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచం: సీడీపీఓ ఉమారాణి

పలమనేరు, ఆగస్టు 07 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు అర్బన్ సెక్టారు పరిధిలోని కేవీఎస్ స్ట్రీట్ అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సీడీపీఓ ఉమారాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీడీపీఓ ఉమారాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నజ్మా తల్లులకు, గర్భవతులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉమారాణి మాట్లాడుతూ… తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని పేర్కొన్నారు. కాన్పు అయిన వెంటనే వచ్చే ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా (వ్యాక్సిన్) లాగా పనిచేస్తాయని, ఇవి ఆరు నెలల వరకు బిడ్డకు అవసరమైన రోగనిరోధక శక్తిని అందించి, రేచీకటి మరియు ఇతర ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయని తెలిపారు. అనంతరం సూపర్‌వైజర్ నజ్మా మాట్లాడుతూ….బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉండే తల్లిపాలు మాత్రమే అందించాలన్నారు. పిల్లల మెదడు అభివృద్ధిలో 80% మొదటి రెండు సంవత్సరాల లోపే జరుగుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలలో ఐక్యూ పెరుగుతుందన్నారు. ఏడవ నెల నుండి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు పౌష్టికాహారాన్ని (అనుబంధ ఆహారం) అందించాలని, ‘వెయ్యి రోజుల సంరక్షణ’ బిడ్డ భవిష్యత్తుకు ఎంతో కీలకమని వివరించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చని, అలాగే బిడ్డకు-తల్లికి మధ్య అనుబంధం పెరుగుతుందని తెలిపారు. పోత పాల వల్ల జరిగే నష్టాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త లతా, పలువురు గర్భవతులు, బాలింతలు మరియు పిల్లల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.