GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 5:32 am Digital Edition : GURU SWAMY

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

*అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, సెప్టెంబర్ 19 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ తక్షణ చర్యలు చేపట్టాలని నాయకులకు స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పాఠశాలల అభివృద్ధి కమిటీల పనితీరు, నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కొత్త పనులు తదితర అంశాలపై నాయకులతో చర్చించారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో వేర్‌హౌస్ కమిటీ డైరెక్టర్ రంగనాథ్, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్, ఆర్వీ బాలాజీ, రామచంద్ర నాయుడు, విజయభాస్కర్ రెడ్డి, కిషోర్ గౌడ్, రాంబాబు, సోమశేఖర్ గౌడ్, ఆనంద్, నాగరాజు రెడ్డి, కుట్టీ, గిరిబాబు, ప్రతాప్ రెడ్డి, ఖాజా, సురేష్, సుధాకర్, నాగరాజు, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు.