GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 2:17 pm Posted by : GARUDA DHATRI NEWS

తొండూరు పునరావాస భూములపై హైకోర్టు కీలక తీర్పు

తొండూరు పునరావాస భూములపై హైకోర్టు కీలక తీర్పు

-పునరావాస భూములపై పూర్తి యాజమాన్య హక్కులు వుండదు

-పరిహారం చెల్లించి ప్రభుత్వ అవసరాలకు భూములు తిరిగి తీసుకోవచ్చు

గరుడధాత్రి :
శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద కేటాయించిన భూములపై యాజమాన్య హక్కులు లేవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ ఆర్డర్ ద్వారా ఇచ్చిన భూముల నిబంధనలను సాధారణ ప్రభుత్వ మెమో ద్వారా మార్చలేమని కోర్టు తేల్చింది.
కేసు నేపద్యంలోకి వెళితే.. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ స్థాపన సమయంలో భూములు కోల్పోయిన కుటుంబాల పునరావాసం కోసం ప్రభుత్వం 1970లో GO 1024 ద్వారా భూములు కేటాయించింది. ప్రతి కుటుంబానికి గరిష్టం గా 5 ఎకరాల పొడి భూమి లేదా 2 ఎకరాల తడి భూమి ఉచితంగా ఇచ్చారు. మిగిలిన భూములు భూమిలేని పేదలకు సాధారణ అసైన్మెంట్ విధానం ప్రకారం ఇచ్చారు. ఈ భూములు వారసత్వంగా పొందవచ్చని, కానీ అమ్మడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదని గవర్నర్ ఆర్డర్ స్పష్టం గా పేర్కొంది.
తరువాత 2000లో ఒక ప్రభుత్వ మెమో జారీ చేయబడింది. దాని ఆధారంగా కొంతమంది లబ్ధిదారులు తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయని వాదించారు. ఈ వివాదం అనేక దశల్లో హైకోర్టు ముందు వచ్చింది. 2008లో ఈ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని తొండూరు గ్రామంలో SEZ స్థాపించేందుకు APIIC ద్వారా శ్రీసిటీ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది.
దీనిపై మళ్ళీ కేసులు కొనసాగగా, 2026 మే 11 న హైకోర్ట్ డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ రవి నాథ్ తిలహరి, జస్టిస్ మహేశ్వరరావు కుంచెం తీర్పునిస్తూ, పునరావాస ప్యాకేజీ కింద పొందిన భూములు అసైన్‌మెంట్ భూములేనని, వాటిపై పూర్తి యాజమాన్య హక్కులు కలుగవని పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులు లేదా పట్టాదార్ పాస్‌బుక్లు యాజమాన్యానికి ఆధారాలు కావని కోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వం అవసరాల కోసం ఈ భూములను రీసంప్షన్ (ప్రభుత్వం ఇచ్చిన హక్కును తిరిగి తీసుకోవడం) ద్వారా తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని, కానీ భూములు కోల్పోయిన వారికి యజమానుల స్థాయిలో పూర్తి పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
అప్పటి (2006) ఉమ్మడి చిత్తూరు జిల్లా జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ రావత్, శ్రీసిటీ యాజమాన్యం ప్రత్యేక చొరవతో పట్టాభూములకు సమానంగా డీకేటీ భూములకు భూపరిహారాన్ని ప్రకటించి చాలామంది రైతులకు పరిహారం పంపిణీ కూడా చేయడం జరిగింది అయితే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. యాజమాన్య హక్కులు చెల్లవని ఈ కేసు పై తుది తీర్పు వెలువరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, ఇప్పటికీ పరిహారం స్వీకరించని వారికి గతంలో ప్రకటించిన పరిహారాన్ని యధావిధిగా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది
ఈ తీర్పుతో తొండూరు గ్రామంలోని పునరావాస భూములపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి స్పష్టత లభించగా, భవిష్యత్తులో ఇలాంటి అసైన్‌మెంట్ భూముల వ్యవహారాల్లో ఇది కీలక మార్గదర్శకంగా నిలిచింది