-పది రోజుల్లోనే సగానికి పడిపోయిన ధరలు!
పలమనేరు, జూన్ 18 ( గరుడ ధాత్రి ) :
సీజన్ ప్రారంభంలోనే తోతాపురి మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పదిహేను రోజుల క్రితం మార్కెట్లో కిలో రూ. 6 నుంచి రూ. 8 వరకు పలికిన ధర.. కేవలం పది రోజుల్లోనే సగానికి పడిపోయింది. ప్రస్తుతం కొన్ని రాంపుల్లో (మార్కెట్ కేంద్రాల్లో) కిలో కేవలం రూ. 2 నుంచి రూ. 4 మాత్రమే పలుకుతుండటంతో తోటల యజమానులు, రైతులు లబోదిబోమంటున్నారు. మామిడి పంట సాగు కోసం సంవత్సరం పొడవునా లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు.. తీరా కోత దశకు వచ్చేసరికి గుజ్జు పరిశ్రమల (పల్ప్ ఫ్యాక్టరీల) యాజమాన్యాలు, వ్యాపారులు గట్టి షాక్ ఇచ్చారు. వీరంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి, తమ స్వలాభాల కోసం ప్రతి ఏటా ధరలను ఇష్టారాజ్యంగా తగ్గిస్తున్నారని రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వక దోపిడీయే: రైతు సంఘం మండిపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 40కి పైగా గుజ్జు తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ, పాత నిల్వలు లేకపోయినా కావాలనే చురుగ్గా కొనుగోలు చేయడం లేదని చిత్తూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఉమాపతి నాయుడు మండిపడ్డారు. “ఇది ముమ్మాటికీ పల్ప్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు చేస్తున్న ఉద్దేశపూర్వక దోపిడీయే. మార్కెట్‌లో పాత స్టాక్ లేకపోయినా, కావాలనే కొనుగోళ్లను మందగించి, రైతులను నిలువునా ముంచుతున్నారు,” అని ఉమాపతి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి
సంవత్సరమంతా కష్టపడి, మందులు కొట్టి, కాయను కాపాడుకుంటే.. తీరా మార్కెట్‌కు తెచ్చాక కనీసం రవాణా ఖర్చులు, కోత కూలీల డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మద్దతు ధర ప్రకటించాలని, ఫ్యాక్టరీల సిండికేట్‌ను బద్దలు కొట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.