త్రాగునీటి ట్యాంకు మెట్లు దెబ్బతిని ప్రజలకు ముప్పు
-తక్షణ మరమ్మతులు చేపట్టి ట్యాంకును శుభ్రపరచాలని టీడీపీ డిమాండ్
గరుడధాత్రిన్యూస్ :
నాగలాపురం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న త్రాగునీటి ట్యాంకు మెట్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంకును శుభ్రపరిచే పరిస్థితి లేకపోవడంతో ప్రజలకు సరఫరా అవుతున్న త్రాగునీరు కలుషితమై, సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ట్యాంకు మెట్లను మరమ్మతులు చేసి, త్రాగునీటి ట్యాంకును పూర్తిస్థాయిలో శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు టిజే ప్రణీత్ రెడ్డి పంచాయతీ ఈవోకు వినతిపత్రం సమర్పించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ లక్ష్యమని, ప్రజల ఆరోగ్య విషయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాగలాపురం టౌన్ వార్డు సభ్యులు సునీల్, ఐటీడీపీ మండల అధ్యక్షులు నరేంద్ర రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మనోజ్ నాయుడు, సురుటపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు నెల్సన్ మండేలా, ఎస్సీ సెల్ నాయకులు నాగరాజ్, పాఠశాల చైర్మన్ సుబ్రహ్మణ్యం, పురుషోత్తం తదితర టీడీపీ యువ నాయకులు పాల్గొన్నారు.