GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 4:07 am Digital Edition : GURU SWAMY

దాసుకుప్పంలో తారాస్థాయికి చేరిన వైఎస్సార్‌సీపీ ప్రచారం

ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు.. ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

సత్యవేడు, గరుడధాత్రి న్యూస్:

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సత్యవేడు మండలంలో రాజకీయ సందడి నెలకొంది. నవంబర్ 5వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి చివరి రోజు కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఇందులో భాగంగా దాసుకుప్పం గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఏవీఎం బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు జడ్పీటీసీ అభ్యర్థి ఆశాలత ఏబినైజర్, దాసుకుప్పం ఎంపీటీసీ అభ్యర్థి కుప్పయ్య పలువురు పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
గ్రామంలోని ముస్లిం కాలనీ, అరుంధతివాడ, ఎస్సీ కాలనీ, ఇందిరానగర్, హౌసింగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ తమకు ఒక్క అవకాశం కల్పించి ఆదరించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి ఆశాలత మాట్లాడుతూ తనను గెలిపిస్తే మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎంపీటీసీ అభ్యర్థి కుప్పయ్య మాట్లాడుతూ తనను ఆదరిస్తే దాసుకుప్పం సెగ్మెంట్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఓటర్లకు భరోసా ఇచ్చారు.
నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థులు ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మస్తానమ్మ, రాము, కేశవులు, శరవణ తదితరులు పాల్గొన్నారు.