GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 6:58 pm Posted by : GURU SWAMY

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతగా

నెల్లూరు, ఏప్రిల్ 26: దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం నగరంలోని వి.ఆర్.సి నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె అవగాహన రన్‌లో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ నందన్, డీఆర్వో విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ ఇళ్ల వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. మే 1 నుండి 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి భౌతిక గణన చేపడతారని చెప్పారు. దేశ ప్రగతికి జనగణన కీలకమని, ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ 2011 తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా జనగణన చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఖచ్చితమైన జనాభా గణాంకాలు అభివృద్ధి ప్రణాళికలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు దోహదపడతాయని వివరించారు. ప్రజలందరూ విస్తృతంగా పాల్గొని దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

వి.ఆర్.సి నుంచి రామలింగాపురం, మినీ బైపాస్, మాగుంట లేఔట్, కెవిఆర్ సర్కిల్, కొండాయపాలెం గేట్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.