GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 12:58 pm Digital Edition : GURU SWAMY

నాగలాపురంలో రక్షణ వ్యవస్థపై స్థానికుల ఆందోళన

పట్టపగలే వృద్ధురాలి ఇంట్లో చోరీ.. భౌతిక దాడి

పనిచేయని నిఘా నేత్రాలు.. భద్రతపై స్థానికుల ఆందోళన

నాగలాపురం, సెప్టెంబర్ 13, గరుడధాత్రి:

తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రంలో ప్రజల భద్రతపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం బజారు వీధిలో నివాసం ఉంటున్న 72 ఏళ్ల ఉష అనే వృద్ధురాలి ఇంట్లో పట్టపగలే చోరీ జరగడంతో పాటు ఆమెపై భౌతిక దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో మండల కేంద్రంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మండల కేంద్రంలోనే పట్టపగలు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. రద్దీ ప్రాంతాల్లో పోలీసుల నిఘా మరింత పెంచాలని, ప్రజల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

-పనిచేయని నిఘా నేత్రాలు..!

నాగలాపురం ప్రధాన వీధులు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కొన్ని ప్రస్తుతం పనిచేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిఘా కెమెరాలు అందుబాటులో ఉండి, అవి నిరంతరం పనిచేస్తే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గుర్తించడంతో పాటు నేర ఘటనలు చోటుచేసుకున్నప్పుడు దర్యాప్తుకు కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో అదనపు కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా బజారు వీధులు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

-పోలీసుల పనితీరుపై సమీక్ష చేయాలి

మండల కేంద్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల పనితీరుపై వస్తున్న ఆరోపణలను ఉన్నతాధికారులు పరిశీలించి, నాగలాపురంలో భద్రతా పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇకనైనా జిల్లా పోలీసు యంత్రాంగం నాగలాపురం మండల కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడం, అవసరమైన ప్రాంతాల్లో కొత్త కెమెరాలను ఏర్పాటు చేయడం, రాత్రి వేళల్లో గస్తీని పెంచడం వంటి చర్యలు చేపట్టాలని మండల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.