GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 10:20 am Digital Edition : GURU SWAMY

నాగలాపురం మండల కార్యకర్తలకు మొండిచేయి  – నామినేటెడ్ పదవుల కేటాయింపుపై బీజేపీ ఆగ్రహం

నాగలాపురం మండల కార్యకర్తలకు మొండిచేయి

– నామినేటెడ్ పదవుల కేటాయింపుపై బీజేపీ ఆగ్రహం

​నాగలాపురం, ఏప్రిల్ 29, (గరుడధాత్రి న్యూస్):

నాగలాపురం మండలంలోని క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించి, నామినేటెడ్ పదవులను ఏకపక్షంగా కేటాయించడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కూటమి విజయానికి అహర్నిశలు శ్రమించిన స్థానిక కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకుండా, కేవలం టీడీపీకి చెందిన వారికే పదవులు కట్టబెట్టడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ​ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సభ్యులు కె విజయన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, పదవుల పంపకంలో సొంత పార్టీ వారికే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కష్టపడి పనిచేసే కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంటుందని వారు హెచ్చరించారు. ​స్థానిక కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని నాగలాపురం మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలన్నారు. పదవుల ఎంపిక ప్రక్రియలో మిత్రపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవని ​న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి నాయకత్వం స్పందించి, అర్హులైన మండల కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ​కూటమి ధర్మాన్ని పాటించి, అన్ని వర్గాల కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించినప్పుడే మండలంలో పరిపాలన సజావుగా సాగుతుందని వారు స్పష్టం చేశారు.