రైతులపై అక్రమ వసూళ్ల పర్వం
రీసర్వే పేరుతో రైతుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్న మండల సచివాలయ సర్వేయర్లు
నాగలాపురం జూలై 06 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా, నాగలాపురం మండల రెవెన్యూ శాఖలో రైతుల నుంచి వివిధ పనుల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేంబాకం గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఆరోపణల ప్రకారం, ఎంజాయ్‌మెంట్ నమోదు చేయాలంటే రూ.10,000, ఆన్‌లైన్ నమోదు చేయాలంటే రూ.25,000, వ్యవసాయ బోరుకు ఎంజాయ్‌మెంట్ ఇవ్వాలంటే రూ.4,000 వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దరఖాస్తులపై సంతకాలు చేయడం లేదని, పనులను ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా మండల సచివాలయ సర్వేయర్లు రీ సర్వే పేరుతో రైతుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.
అంతేకాకుండా, “డీకేటీ భూములకు కూడా డబ్బులు ఇస్తే పట్టాలు ఇప్పిస్తాం” అంటూ కొందరు రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు