GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:21 am Digital Edition : GURU SWAMY

నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానంపై అందరి దృష్టి..!

త్రిముఖ పోరు.. అత్తాకోడళ్ల మధ్య ఆసక్తికర పోటీ

గెలుపెవరిది..? ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!

బైరెడ్డిపల్లి, అక్టోబర్ 28 గరుడదాత్రి న్యూస్:

బైరెడ్డిపల్లి మండలంలోని నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. అధికార టీడీపీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో ఈ స్థానం ఎవరిని వరిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార టీడీపీ అభ్యర్థి రాధ కిషోర్ గౌడుకు స్వయానా అత్త అయిన ఇరాల కృష్ణవేణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

-అత్తాకోడళ్ల మధ్య ఆసక్తికర పోరు!

నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానానికి అధికార టీడీపీ తరఫున మాజీ జెడ్పీటీసీ రాధ కిషోర్ గౌడు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ మండలాధ్యక్షురాలు ఇరాల కృష్ణవేణి, వైఎస్సార్‌సీపీ తరఫున మొగశాల రాధ పోటీ చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు తమ విజయమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడంతో మొగశాల రెడ్డెప్ప ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా గెలిచి ఎంపీపీ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ అభ్యర్థి రాధ కిషోర్ గౌడు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

-టీడీపీ టికెట్ దక్కక స్వతంత్రంగా బరిలోకి..

టీడీపీలో కొనసాగిన ఇరాల కృష్ణవేణి నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానానికి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు, అధికార పార్టీ అభ్యర్థి రాధ కిషోర్ గౌడుకు కృష్ణవేణి స్వయానా అత్త కావడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
మంగళవారం ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కృష్ణవేణి ఇంటికి వెళ్లి ఆమెను బుజ్జగించి పోటీ నుంచి తప్పుకోవాలని కోరినట్లు సమాచారం. అయినప్పటికీ, ఆమె పోటీలో కొనసాగేందుకే మొగ్గుచూపడంతో అధికార పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

-కృష్ణవేణి బలాబలాలపై రాజకీయ వర్గాల్లో చర్చ!

మాజీ మండలాధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం, మాజీ జెడ్పీ చైర్మన్ రామేగౌడు కుటుంబానికి కోడలిగా ఉన్న గుర్తింపు, స్థానికంగా పెట్రోల్ బంక్, గ్యాస్ డీలర్‌షిప్ నిర్వహణతో ప్రజలకు సుపరిచితురాలిగా ఉండటం ఇరాల కృష్ణవేణికి కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. బైరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ జయకుమార్ సతీమణిగా కూడా ఆమెకు స్థానికంగా పరిచయాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణవేణి ప్రధాన పార్టీల ఓటు బ్యాంకులకు ఎంతవరకు గండికొడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమెకు లభించే ఓట్లను బట్టి ప్రధాన అభ్యర్థుల విజయావకాశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

-టీడీపీ ధీమా.. వైఎస్సార్‌సీపీ ఆశలు!

టీడీపీ అభ్యర్థి రాధ కిషోర్ గౌడు భర్త కిషోర్ గౌడు మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉండటం, ఆమెకు గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉండటం, కూటమి నాయకుల మద్దతు లభిస్తుండటంతో విజయం తమదేనని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు, గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకుని ఎంపీపీ పదవిని దక్కించుకున్న నేపథ్యంలో, ఈసారి కూడా విజయాన్ని పునరావృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మొగశాల రాధకు స్థానిక రాజకీయ పరిచయాలు, పార్టీ శ్రేణుల మద్దతు కలిసివస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

-ముగ్గురు మహిళా అభ్యర్థులు.. ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ!

ఒకవైపు అధికార పార్టీ బలం, మరోవైపు గత ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌సీపీకి ఉన్న అనుకూలత, ఇంకోవైపు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణవేణి వ్యక్తిగత పరిచయాలు, రాజకీయ అనుభవం.. ఇలా నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ పోటీ రసవత్తరంగా మారింది.
ముగ్గురు మహిళా అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తుండటంతో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందన్నది అంతుచిక్కడం లేదు. అత్తాకోడళ్ల మధ్య పోటీ ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది? ప్రధాన పార్టీల ఓట్లను స్వతంత్ర అభ్యర్థి ఎంతవరకు ప్రభావితం చేస్తారు? చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? అన్న ప్రశ్నలకు సమాధానం ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.
నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానం.. బైరెడ్డిపల్లి మండల రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక స్థానంగా మారింది.