GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 1:21 am Digital Edition : GURU SWAMY

నాటు తుపాకీతో అన్నను కాల్చి చంపిన తమ్ముడు.. ఐదుగురు నిందితుల అరెస్ట్

భూవివాదాలు, కుటుంబ కక్షలే కారణం

పలమనేరు, ఆగస్టు11 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం మారపల్లిలో సంచలనం సృష్టించిన సీ.జీ. శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. భూ వివాదాలు, కుటుంబ కక్షల నేపథ్యంలో స్వయానా తమ్ముడే (సవతి తల్లి కొడుకు) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి హత్యకు ఉపయోగించిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మంగళవారం పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్లో వివరాలను మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే…మారపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులును ఆగస్టు 6వ తేదీ రాత్రి పాపన్న భూమిలోని బండపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్చి చంపారు. దీనిపై ఆగస్టు 7న పెద్దపంజాణి పోలీస్ స్టేషన్‌లో కేసు (Cr.No.59/2026) నమోదైంది. జిల్లా ఎస్పీ తుషార్ దూడి, పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ ఆదేశాలతో పలమనేరు రూరల్ సీఐ బి. పరశురాముడు, పెద్దపంజాణి ఎస్ఐ ఎం. సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల ముమ్మర గాలింపు చర్యల్లో భాగంగా, మంగళవారం ఉదయం రాయలపేట పంచాయతీ చెన్నారెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద ఐదుగురు అనుమానితులను (రామలింగం, నాగరాజు, రాజశేఖర్, మునిరాజ్, ప్రకాష్) పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఇచ్చిన సమాచారంతో నేరస్థలంలో ఉన్న నాటు తుపాకీతో పాటు, కుంటలో పడేసిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా నాటు తుపాకులు కలిగి ఉండటం, వాటిని వినియోగించడం లేదా వాటి ద్వారా నేరాలకు పాల్పడటం తీవ్రమైన నేరమని ఈ సందర్బంగా పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరివద్దనైనా ఇలాంటి అక్రమ ఆయుధాలు ఉన్నట్లు సమాచారం తెలిస్తే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.