GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 12:41 am Digital Edition : GURU SWAMY

నారాయణవనం, నాగలాపురం ఆలయాల అభివృద్ధి పనులపై జేఈవో డా. ఎ. శరత్ సమీక్ష

భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే టీటీడీ లక్ష్యం : జేఈవో

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లను చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి రెండు ఆలయాలను సందర్శించి, ఆలయాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్దేశిత సమయానికి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆలయ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని జేఈవో ఆదేశించారు.

భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కలిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అలాగే దాతల సహకారంతో ఆలయాల్లో ప్రతిరోజూ భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన అన్నప్రసాదాలను నిరంతరం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం వాహన మండపం, పోటు, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన అదనపు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ ఎ. ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
——————–