-పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర పర్యవేక్షణలో డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు
పిచ్చాటూరు, జూన్ 23 గరుడధాత్రి:
యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం పిచ్చాటూరు, నారాయణవనం, వడమాలపేట, కెవిబిపురం మండలాలకు చెందిన 62 మంది యువకులకు డ్రగ్స్ మరియు గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
సంబంధిత మండలాల ఎస్సైలు అందించిన సమాచారం మేరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు సీఐ రవీంద్ర వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నారని, తద్వారా తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు యువతలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఇకపై మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, గంజాయి సరఫరా చేసే వారిపైనా, వినియోగించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు ఎస్సై రాఘవేంద్ర, నారాయణవనం ఎస్సై గిరి, వడమాలపేట ఎస్సై హరీష్, కెవిబిపురం ఎస్సై ఓబయ్యతో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, డ్రైవర్లు మరియు నాలుగు మండలాలకు చెందిన యువత పాల్గొన్నారు.