GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 8:45 pm Posted by : GARUDA DHATRI NEWS

నిర్వీర్యమైన విద్య, వైద్య రంగాలు- వైఎస్సార్‌సీపీ నేతల ఫైర్

-సూపర్ సిక్స్‌.. సూపర్ ఫ్లాప్!

-హామీల అమలులో చేతులెత్తేసిన కూటమి సర్కారు

-నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ పేరిట యువతకు తీవ్ర వంచన

-వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట పిచ్చాటూరులో భారీ నిరసన

పిచ్చాటూరు జూన్ 04 గరుడధాత్రి :

ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ మోసపూరిత పాలనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కె.వి.చలపతిరాజు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా చలపతిరాజు మాట్లాడుతూ.. ఓట్ల కోసం చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలు కాస్తా ఇప్పుడు ‘సూపర్‌ ఫ్లాప్‌’గా మారాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసి బాబు మార్కు మోసపూరిత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి నిలువునా దగా చేశారన్నారు. ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారని, తక్షణమే ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అగమ్యగోచరంగా నిరుద్యోగుల భవిష్యత్తు

మెగా డీఎస్సీ’ పేరుతో నిరుద్యోగ యువతను ఈ ప్రభుత్వం తీవ్రంగా మభ్యపెడుతోందని నాయకులు విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై ఎలాంటి స్పష్టతా లేకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కళకళలాడిన ప్రభుత్వ ఆస్పత్రులు నేడు కనీస మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది కొరతతో వెలవెలబోతున్నాయన్నారు. సంక్షేమ పథకాలను సైతం నీరుగార్చారని, ప్రజల కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

-క్షమాపణ చెప్పాలి
రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.భాస్కర్‌ నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని, మాట నిలబెట్టుకోలేని పక్షంలో సీఎం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో ప్రజల ఆశలు అడియాశలయ్యాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.