గరుడధాత్రి :
విద్యా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు నెల్లూరు సిద్ధమైంది. దక్షిణాది రాష్ట్రాల విద్యా స్వరూపాన్నే మార్చేయగల అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ – RIE నెల్లూరులో ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఇనిస్టిట్యూట్ ఎప్పుడో మంజూరైనా గత పాలకుల నిర్లక్ష్యం, రకరకాల అడ్డంకులతో మూలనపడింది. కూటమి ప్రభుత్వం చొరవతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. నిర్మాణ పనులను వేగంగా పట్టాలెక్కించేందుకు వీలుగా పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయింది. కర్ణాటకలోని మైసూర్ తర్వాత, సౌత్ ఇండియాలోనే రెండవ అతిపెద్ద RIE క్యాంపస్‌గా నెల్లూరు అవతరించబోతోంది.
ఈ అంతర్జాతీయ స్థాయి క్యాంపస్‌ను నెల్లూరులో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 234.36 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ క్యాంపస్ కాన్సెప్ట్‌తో ఈ మాస్టర్ ప్లాన్‌ను డిజైన్ చేశారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, రీసెర్చ్ సెంటర్లు, అత్యాధునిక లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్‌తో పాటు విద్యార్థులు, ఫ్యాకల్టీ కోసం వరల్డ్ క్లాస్ వసతి గృహాలను ఇక్కడ నిర్మించనున్నారు.
NCERT నేరుగా పర్యవేక్షించే ఈ నెల్లూరు RIE.. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల విద్యా అవసరాలను తీర్చే ఒక మెగా సెంటర్‌గా మారనుంది. దక్షిణ భారతదేశంలోనే ఉపాధ్యాయ శిక్షణ, విద్యా రంగ పరిశోధనల్లో ఇది టాప్ లీగ్‌లో నిలవబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన జాతీయ విద్యా విధానం – NEPకి అనుగుణంగా, కాబోయే ఉపాధ్యాయులను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడంలో ఈ సంస్థ అత్యంత కీ రోల్ ప్లే చేయబోతుంది.
గతంలో కేంద్రం ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటికీ, వైసీపీ హయాంలో భూసేకరణ, పరిపాలనా అనుమతుల్లో తీవ్ర ఆలస్యం జరిగింది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఈ ప్రాజెక్టు పనుల్లో స్పష్టమైన వేగం కనిపిస్తోంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ విడుదల కావడం, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ ప్రక్రియ తుది దశకు చేరడంతో హర్షం వ్యక్తమవుతోంది. పర్యావరణ అనుమతులు రాగానే యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏపీ విద్యా ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది.