GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:58 am Digital Edition : GURU SWAMY

నేను ఊర్లో లేను.. -తరచూ రద్దువుతున్న బస్ సర్వీసులు..

-ఎమ్మెల్యే అభ్యర్థనలు
బుట్ట దాఖలు చేసిన ఆర్ఎం!!

సార్.. సత్యవేడు ఆర్టీసీ డిపో పరిస్థితి బాగాలేదు…

సర్వీసులు రద్దు అవుతున్నాయి… డిపో ఉనికికే ప్రమాదంగా మారింది… డిపో మేనేజర్ వైఖరి పై ఫిర్యాదులు ఉన్నాయి… మీరు సమీక్ష చేసి… డిపోను ప్రగతి పదం వైపు నడిపించండి అంటూ
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, స్థానిక టిడిపి నాయకులు గత జూలై 18న తిరుపతిలో ఆర్టీసీ ఆర్ ఎం కు వినతి పత్రం ఇచ్చి స్పందించాలని కోరారు ఇంకేముంది… ఆర్ఎం డిపోకు వచ్చి కార్మికులతో మాట్లాడి… పరిస్థితిపై సమీక్షించి న్యాయం జరుగుతుందని నిరీక్షించిన వారికి నిరాశే మిగిలింది… నాగలాపురం బస్ స్టేషన్ వద్దకు ఆర్ఎం రావడం… అన్ని బాగా చూసుకోండి అని డిపో మేనేజర్కు చెప్పి .. ఆయన గారు డిపోకు రాకుండానే తిరుపతికి వెళ్లిపోయారు… ఇక చెప్పాలా… యధా రాజా.. తథా ప్రజా అనే విధంగా… మళ్లీ సర్వీసులు రద్దు అవుతున్నాయి.. మంచి కలెక్షన్ తెచ్చే సర్వీస్ లను కుంటి సాకులతో రద్దు చేస్తున్నారు దాంతో ప్రయాణికులు ఆటోలే దిక్కుగా చేసుకుని ప్రయాణాలు సాగించాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.. కండక్టర్లు, డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు నాలుగు మాసాలుగా ఏమీ లేవు… తిరుపతి, శ్రీకాళహస్తి మార్గంలో సర్వీసులు రద్దవుతూనే వస్తున్నాయి

-పుణ్యకాలం…

ఒకటా రెండా మూడేళ్లకు పైగా ప్రస్తుతం ఉన్న డిపో మేనేజర్ ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నారు.. అన్ని సర్దుకుంటుంది… తాను కూడా రికార్డు స్థాయిలో డిపోలో పనిచేసిన డిపో మేనేజర్ గా పేరు సాధించడానికి ఆయన కాలాన్ని నెట్టేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ సర్వీసు రద్దవుతుందో డిపోలో ఎవరికీ తెలియని పరిస్థితి.. ఉన్నత అధికారుల క్షేత్రస్థాయి సమీక్షలు లేకపోవడం ఈ డిపోకు పెద్ద శాపంగా మారింది.

-వారికి అవస్థలే..

సత్యవేడు నుంచి చెన్నైకు ఉదయం ఏడు గంటలకు ఆర్టీసీ సర్వీస్ ఉంది అయితే తరచూ ఈ సర్వీసు రద్దవుతూ ఉండటం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు డిపోలో మంచి కలెక్షన్ తెచ్చే ఈ సర్వీస్ పట్ల డిపో మేనేజర్ తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నట్లు ఉండి సర్వీసు రద్దయిందని చెప్పడంతో విద్యార్థులు పడే అవస్థలు వర్ణనాతీతం కవర్ పేట, పొన్నేరి, తర్చూర్ కుట్ రోడ్ పరిసరాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇక్కడి విద్యార్థులు అక్కడికి వెళ్లి చదువుతున్నారు ఈ సర్వీసు రద్దవడం వల్ల విధి లేక ద్విచక్ర వాహనాల్లో కాలేజీలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం కూడా ఈ సర్వీసు రద్దయిందని చాలా ఆలస్యంగా అధికారులు తెలియజేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు.

-మూతతథ్యం..!?

కొత్త సర్వీసులు లేకపోగా.. ఉన్న సర్వీసులు కూడా తరచూ రద్దు అవుతున్నాయి. దీనికి తోడు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం సత్యవేడు ఆర్టీసీ డిపోకు శాపంగా మారింది పరిస్థితులు ఇలాగే కొనసాగితే… డిపో మేనేజర్ బదిలీ… డిపోకు మూతపడటం ఒకే సందర్భంలో జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..