GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 7:03 am Digital Edition : GURU SWAMY

పదవికి ముగింపు.. .ప్రజాసేవకు కాదు – ఎంపిపి ప్రతిమ

సత్యవేడు, సెప్టెంబర్ 22 గరుడధాత్రి :
ఐదేళ్ల రాజకీయ ప్రయాణానికి ముగింపు పలికే వేళ సత్యవేడు మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన చివరి సర్వసభ్య సమావేశం భావోద్వేగంగా ముగిసింది. ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాధారణంగా అభివృద్ధి పనులు, పరిపాలనా అంశాలపై చర్చ జరగాల్సిన సమావేశం.. పదవీకాలం ముగింపు నేపథ్యంలో జ్ఞాపకాలను నెమరువేసుకునే వేదికగా మారింది.
సమావేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని, మండల ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఎంపీపీ ప్రతిమ గుర్తుచేసుకున్నారు. మండల పరిషత్‌ కార్యాలయంతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తనను ఆదరించిన ప్రజలను, రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన వారిని స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
సర్పంచ్‌గా మూడు పర్యాయాలు పనిచేయడం, అనంతరం ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తన రాజకీయ జీవితంలో ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవంగా ఆమె పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నంటే నిలిచిన తండ్రి రఘుపతి రెడ్డి, భర్త సుశీల్ కుమార్ రెడ్డి సహకారాన్ని ఆమె ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. అలాగే తన రాజకీయ గురువుగా భావించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.
“పదవి ముగిసిందని ప్రజాసేవ ముగిసిపోదు. రాజకీయ పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రజలతో ఏర్పడిన అనుబంధం మాత్రం శాశ్వతంగా కొనసాగుతుంది” అని ప్రతిమ అన్నారు. భవిష్యత్తులో అవకాశం లభిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిమ భర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ కూడా తమ కుటుంబ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేశారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే తమ కుటుంబానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలతో ఉన్న అనుబంధమే శాశ్వతమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యల పరిష్కారానికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటానికి పనిచేశామని తెలిపారు.
సమావేశం అనంతరం ఎంపీపీ ప్రతిమతో పాటు ఎంపీటీసీ సభ్యులను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో వీడ్కోలు పలికారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ, పరిపాలనా కార్యకలాపాలకు వేదికగా నిలిచిన సమావేశ మందిరాన్ని చివరిసారిగా వీక్షించిన ప్రతిమ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.
పదవీకాలానికి ముగింపు పలికినా ప్రజాసేవకు మాత్రం విరామం లేదన్న ఎంపీపీ ప్రతిమ మాటలతో సత్యవేడు మండల పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశం భావోద్వేగ ఘట్టంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి, బాలాజీ రెడ్డి, ఎంపీడీఓ, ఎంఈఓ, డీటీ, ఈఓ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.