GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:33 am Digital Edition : GURU SWAMY

పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం శాశ్వతం!

పిచ్చాటూరు అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు-రేఖా హరిచంద్రరెడ్డి

పిచ్చాటూరు సెప్టెంబర్ 23 గరుడధాత్రి :

మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కె.టి. రేఖా హరిచంద్రరెడ్డి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో సాధించిన ప్రతి విజయానికి సమిష్టి కృషే కారణమని ఆమె పేర్కొన్నారు.
మండలంలోని గ్రామాల అభివృద్ధికి తనతో కలిసి పనిచేసిన ఎంపీటీసీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, మండల పరిషత్‌ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనను ఆదరించి గెలిపించిన పిచ్చాటూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, వినతులను బాధ్యతగా తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేసినట్లు రేఖా హరిచంద్రరెడ్డి తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు.
“పదవులు శాశ్వతం కావు.. ప్రజల ప్రేమాభిమానాలే శాశ్వతం. పదవీకాలం ముగిసినా పిచ్చాటూరు ప్రజలతో తనకున్న ఆత్మీయ అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది. మండల ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ తన వంతు కృషి కొనసాగిస్తాను” అని ఆమె తెలిపారు.
ఇన్నాళ్లు తనను ఆదరించిన పిచ్చాటూరు మండల ప్రజల ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కె.టి. రేఖా హరిచంద్రరెడ్డి పేర్కొన్నారు.