పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) :
పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని పలమనేరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, వార్డు పరిపాలనా కార్యదర్శులతో గురువారం ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను, తాగునీటి చార్జీల వసూళ్ల ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో పన్ను బకాయిల వివరాలు: పాత బకాయిలు రూ. 2.74 కోట్లు, ప్రస్తుత డిమాండ్ రూ. 2.80 కోట్లు. తాగునీటి చార్జీలు పాత బకాయిలు రూ. 61.20 లక్షలు, ప్రస్తుత డిమాండ్ రూ. 70.30 లక్షలు. మొత్తం బకాయిలు సుమారు రూ. 6.86 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రూ. 1.34 కోట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రూ. 1.56 లక్షల బకాయిలు ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్ రెడ్డి సహకారంతో పట్టణంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని కమిషనర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పట్టణాన్ని సకల సదుపాయాలతో తీర్చిదిద్దడానికి నిధులు అత్యవసరమని, కావున బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే, తాగునీటిని వృథా చేయరాదని, కుళాయిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్ లు బిగించరాదని స్పష్టం చేశారు. మోటార్ లు వాడి ఇతరులకు నీటి సరఫరాలో అంతరాయం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డు కార్యదర్శులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి మొండి బకాయిల వసూళ్ల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.