GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 6:48 am Posted by : GARUDA DHATRI NEWS

పర్యావరణ పరిరక్షణకు ఇ-సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహిద్దాం – జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

గరుడధాత్రి : పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ మరియు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఇ-సైకిళ్ల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సుశీల దేవితో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇ-సైకిల్ అవగాహన కార్యక్రమం ద్వారా పెరుగుతున్న వాహనాల వినియోగంతో వాయు కాలుష్యం అధికమవుతోందని, ఇ-సైకిళ్ల వినియోగం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన వ్యయాన్ని కూడా ఆదా చేయవచ్చని తెలిపారు.పర్యావరణ హిత రవాణా వ్యవస్థలను ప్రోత్సహించడం ద్వారా భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధులు ఇ-సైకిళ్ల వినియోగానికి ముందుకు రావాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే కార్యక్రమాలను పంచాయతీ రాజ్ శాఖ నిరంతరం చేపడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ఇ-సైకిళ్ల వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కలెక్టర్ తెలిపారు.
ఇ -సైకిల్ ను వినియోగిస్తున్న పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.