చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):పాన్ ఐఐటీ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాన్ ఐఐటీ అల్యూమిని ప్రతినిధులు ఒక చరిత్రాత్మక సంయుక్త డిక్లరేషన్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో డీప్ టెక్ రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు నోడల్ సంస్థగా వ్యవహరించేలా రాజధాని అమరావతిలో శాశ్వత ‘పాన్ ఐఐటీ అమరావతి కౌన్సిల్’ ఏర్పాటుకు ఉభయ పక్షాలు నిర్ణయించాయి. అంతేకాకుండా, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి మరియు స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.500 కోట్ల భారీ నిధులతో ‘పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి.దేశంలోని 23 ఐఐటీల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు తరలివచ్చిన ‘పాన్-ఐఐటీ ఏపీ 2026’ సదస్సు ఒక చరిత్రాత్మక ఘట్టమని, ఇది మన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్కు నిదర్శనమని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అకాడమియన్ల నెట్వర్క్ అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు కానుండటం శుభపరిణామమని, సుమారు 5 లక్షల మంది ఐఐటీయన్ల మేధోశక్తి, ఆలోచనలను ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కౌన్సిల్ ద్వారా 100 స్టార్టప్ మెంటర్లను తయారు చేయడంతో పాటు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కరిక్యులంలో మార్పులు తెచ్చేందుకు మరియు హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.