GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 6:56 am Digital Edition : GURU SWAMY

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ

అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

తార్కిక దోషాలున్న ఓటర్లకు నోటీసుల జారీ

పలమనేరు, ఆగస్టు 13 ( గరుడ ధాత్రి ) :
ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా పలమనేరు పురపాలక సంఘంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం స్థానిక రంగాపురం సచివాలయంలో బూత్ లెవల్ ఆఫీసర్స్,బూత్ లెవల్ అసిస్టెంట్స్ లతో అధికారులు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దడం, అనర్హులను తొలగించడం, పారదర్శకమైన జాబితా రూపకల్పనపై ప్రధానంగా చర్చించారు. ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, వయస్సులో వ్యత్యాసం వంటి 11 రకాల లాజికల్ ఎర్రర్స్ (తార్కిక దోషాలు) ఉన్న ఓటర్లను అధికారులు గుర్తించారు. వీరికి నోటీసులు పంపనున్నట్లు సమావేశంలో తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తగిన ఆధారాలు సమర్పించి తమ ఓటు హక్కును తిరిగి పొందాలని అధికారులు సూచించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ… పురపాలక సంఘ పరిధిలో ఇటీవల చేపట్టిన ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో మొత్తం 42,580 మంది ఓటర్లకు గాను, 35,610 మంది వివరాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. అయితే, అందుబాటులో లేని (అన్ కలెక్టబుల్) 6,970 ఓట్లను గుర్తించి వాటిని తొలగించనున్నట్లు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఉండాలంటే ప్రజలతో పాటు రాజకీయ పార్టీల సహకారం ఎంతో కీలకమని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు, విచారణ ముగింపు సెప్టెంబర్ 28 వరకు, తుది ఓటర్ల జాబితా ప్రచురణ అక్టోబర్ 3వ తేది ముసాయిదా ఓటర్ల జాబితాలు అన్ని పోలింగ్ కేంద్రాల్లోని బూత్ లెవల్ అధికారుల వద్ద ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు కోసం ఫారం–6,ఓటు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం–7,
వివరాల్లో సవరణలు లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరొక దానికి మార్పు కోసం ఫారం–8. ఈ ఫారాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అయితే బల్క్ (టోకుగా) రూపంలో ఫారాలు ఇవ్వడం కానీ, స్వీకరించడం కానీ జరగదని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ముందుగా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా సరిచూసుకోవాలని సహాయ ఎన్నికల అధికారి కె.లోకేశ్వర వర్మ విజ్ఞప్తి చేశారు. మార్పులు, చేర్పులు ఉంటే గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులు నిర్ణీత గడువులోపు విచారణ పూర్తి చేస్తారని, రాజకీయ పార్టీలచే నియమితులైన బూత్ లెవల్ ఏజెంట్లు కూడా ఈ పక్రియలో చురుకుగా సహకరించాలని కోరారు.