-ఘనంగా ప్రారంభమైన “బడి పిలుస్తోంది” ప్రచార రథం
పిచ్చాటూరు, మే 28 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్. మార్గదర్శకత్వంలో, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కె.వి.ఎన్. కుమార్ మరియు సమగ్ర శిక్ష ఏపీసీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని 36 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ నేపథ్యంలో పిచ్చాటూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో “ఇంటింటికీ బడి పిలుస్తోంది” ప్రచార రథాన్ని బుధవారం కీలపూడిలో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరియు డీఈఓ కె.వి.ఎన్. కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులను మెమొంటోలతో సత్కరించారు.
అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. “మన బడి – మన భవిష్యత్తు” కార్యక్రమం ద్వారా ఆధునిక తరగతి గదులు, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానెల్స్ వంటి డిజిటల్ సదుపాయాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కీలపూడి నుంచి ప్రారంభమైన ప్రచార రథం వెంగళత్తూరు, పులిగుండ్రం, సిద్దిరాజు కండిగ తదితర గ్రామాల్లో పర్యటించింది. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆటపాటలతో గ్రామాల్లో భారీగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. సిద్దిరాజు కండిగలో విద్యార్థులు సాంప్రదాయ కోలాటాలతో ఆకట్టుకోగా, పులిగుండ్రం విద్యార్థులు ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో ప్రభుత్వ బడుల విశిష్టతను చాటిచెప్పారు.
ఈ ప్రచారానికి మంచి స్పందన లభించగా, మొదటి రోజే 32 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ, మండల విద్యాశాఖ అధికారులు హేమాలయ, యుగంధర్ రాజు, పిచ్చాటూరు ఎస్సై, ప్రజాప్రతినిధులు ఇలన్ గోవన్ రెడ్డి, పద్దు రాజు, సుమాంజలి తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
“అందరూ చదవాలి – అందరూ ఎదగాలి” అనే నినాదంతో బడి వయసు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.