పిచ్చాటూరు పీజీఆర్‌ఎస్‌లో తొమ్మిది అర్జీలు
-భూ వివాదాలు, రైస్ కార్డులు, ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదులు
గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సభా ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 9 అర్జీలు స్వీకరించారు.
అందిన ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన 6 దరఖాస్తులు ఉండగా, సీడీపీవో, మండల సర్వేయర్, పోలీసు శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున అందాయి.
రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదుల్లో భూ రికార్డుల్లో పట్టాదారుల పేర్ల సవరణ, ప్రైవేటు భూముల ఆక్రమణలు, దారి వివాదాలు, పెండింగ్ రైస్ కార్డు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. బాధితులు తమ సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని వినతులు సమర్పించారు.
ఇక అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు, ఆహార నిల్వల కొరతపై సీడీపీవోకు ఫిర్యాదు అందగా, స్థానిక ట్రాఫిక్ సమస్యలపై పోలీసు శాఖకు అర్జీ సమర్పించారు. అలాగే కాలువలు, రోడ్లు తదితర ప్రభుత్వ పోరంబోకు భూముల సర్వే నిర్వహించాలని కోరుతూ మండల సర్వేయర్‌కు వినతి అందింది.
కార్యక్రమంలో అందిన అన్ని అర్జీలను నిర్ణీత గడువులోగా పరిశీలించి పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు.