పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి
సత్యవేడులో సిపిఎం ఆధ్వర్యంలో 41వ వర్ధంతి కార్యక్రమం
గరుడధాత్రి న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం సత్యవేడు సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి జనార్ధన్, మండల కార్యదర్శి మెలుగు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎర్రజెండాను ఎగురవేసి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సుందరయ్య స్ఫూర్తితో పేరడం, మదనంబేడు, నాగలాపురం, సత్యవేడు ప్రాంతాలకు చెందిన 30 మంది పార్టీ సభ్యత్వం స్వీకరించారు.
కార్యక్రమంలో దాసరి జనార్ధన్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్మించి వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిన పోరాటయోధుడని గుర్తుచేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధానాలను అవలంబిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సత్యవేడు ప్రాంతంలో బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని, నిరుపేద దళితులు, గిరిజనులకు ఇండ్ల స్థలాలు, సాగుభూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు మురళి, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి పీఎం తిరుమలరెడ్డి, కెవిపిఎస్ మండల కార్యదర్శి విజయ్ భాస్కర్, గ్రీన్ అంబాసిడర్ కార్మిక సంఘ కార్యదర్శి మునుస్వామి, వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి కిష్టయ్య, నాగలాపురం మండల పార్టీ సభ్యులు ఆముద్, కార్యకర్తలు అముల్ రోస్లిన్, సుశీల, సెల్వం, కేశవన్, కొల్లాపిరి, జీవ తదితరులు పాల్గొన్నారు.