GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 3:24 pm Posted by : GARUDA DHATRI NEWS

పోలీస్ స్టేషన్ ప్రహరీపై రహస్య ఆపరేషన్..?

-22 ఏళ్ల గోడను కూల్చి లోపలకు నిర్మాణం.. న్యాయమూర్తికి ఫిర్యాదుతో సంచలనం

సత్యవేడు జూన్ 7 గరుడధాత్రి : దాదాపు 22 ఏళ్లుగా ఉన్న సత్యవేడు పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను ఒక్కసారిగా కూల్చివేసి, ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కొంత లోపలకు జరిపి తిరిగి నిర్మించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభుత్వ భూమి, పోలీస్ స్టేషన్ హద్దుల మార్పు వంటి కీలక అంశాలు తెరపైకి రావడంతో వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై న్యాయవాది జక్కుల శ్రీరామమూర్తి న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడంతో విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రహరీ కూల్చివేత వెనుక అసలు కారణాలేమిటి..? ఎవరి ఆదేశాలతో ఈ పని జరిగింది..? జిల్లా అధికారుల అనుమతులు ఉన్నాయా..? పోలీస్ స్టేషన్ భూమి పరిమాణంలో మార్పులు జరిగాయా..? అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరిగినట్లు సమాచారం. స్థానిక కోర్టు న్యాయమూర్తి వెంకట నాగరాజు స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిసింది.
2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రహరీని కూల్చివేయడం, తిరిగి లోపలకు నిర్మించడం, ప్రహరీ పక్కనున్న చెట్లను నిర్లక్ష్యంగా వదిలేయడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారుల నుంచి స్పష్టమైన వివరణ రావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.