GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:02 pm Digital Edition : GURU SWAMY

పోలేరమ్మ జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు

*సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 1 వరకు ఉత్సవాలు

*1,200 మంది పోలీసులతో భద్రత.. 150 ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్, క్యూ, ఊరేగింపులపై ప్రత్యేక నిఘా

సామాన్య భక్తులకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

గరుడధాత్రి న్యూస్ వెంకటగిరి, సెప్టెంబరు 23:

వెంకటగిరి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరను ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 1 వరకు ఐదు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం వెంకటగిరిలోని పింజలి వీరయ్య కల్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

సెప్టెంబరు 27న ఘటోత్సవంతో జాతర ప్రారంభమై.. 30న ప్రధాన ఉత్సవం, అక్టోబరు 1న నిలువు, నిష్క్రమణ కార్యక్రమాలతో ముగుస్తుందని కలెక్టర్ తెలిపారు. గత జాతరల్లో ఎదురైన సమస్యలను సమీక్షించి ఈసారి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్, క్యూ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

*1,200 మంది పోలీసులతో భద్రత*

జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 1,200 మంది పోలీసు సిబ్బందిని భద్రతా విధుల్లో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. వీఐపీ దర్శనాలను ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే పరిమితం చేసి.. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచుతామన్నారు.

*150 బస్సులు*

‘స్త్రీ శక్తి’ పథకాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల రవాణా కోసం గతేడాది 90 బస్సులు ఏర్పాటు చేయగా.. ఈసారి 150 బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు బస్సుల ఏర్పాటుపై ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

*సామాన్య భక్తులకే ప్రాధాన్యం*

పోలేరమ్మ జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఈసారి భక్తుల సంఖ్య 30 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసి క్యూ లైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ మార్గాలను ముందుగానే సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది బస్సుల కొరతను దృష్టిలో ఉంచుకుని సుమారు 50 అదనపు బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రూ.300 దర్శనం టికెట్లను ముందుగానే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. టికెట్ తీసుకున్న భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. గుంపులుగా భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

*రూ.40 లక్షలతో సాంస్కృతిక కార్యక్రమాలు*

జాతర సందర్భంగా రూ.40 లక్షలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కళాకారులు పాల్గొనేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వేదిక ఏర్పాటుపై నిర్వహించిన IVRS ప్రజాభిప్రాయ సేకరణలో 81 శాతం మంది కాలేజీ గ్రౌండ్‌ను అనుకూలంగా ఎంచుకున్నారని.. దీంతో ప్రజల అభిప్రాయం మేరకు వేదికను అక్కడికి మార్చినట్లు వివరించారు.

*ట్రాఫిక్, ఊరేగింపులపై ప్రత్యేక నిఘా*

జాతరలో ట్రాఫిక్, క్రౌడ్, ప్రాసెషన్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాలను ముందుగానే నిర్ణయించి ట్రాఫిక్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లను పొడిగించడంతో పాటు దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే సమయంలోనూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

చివరి రథోత్సవం, ఊరేగింపు సందర్భంగా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్, మున్సిపల్, అగ్నిమాపక, వైద్య శాఖలతో సమన్వయం చేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

*డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా

జాతరలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో జాతర ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు.

రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతంగా నిర్వహిస్తాయని తెలిపారు. ప్రజలు, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.

సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు చెంచుబాబు, గీతాకుమారి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణనాయక్, డీసీహెచ్‌ఎస్ ఆనందమూర్తి, అగ్నిమాపక అధికారి రమణయ్య, వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ కిరణ్ , జిల్లా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.