GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 8:58 pm Posted by : GARUDA DHATRI NEWS

ప్రచార ఆర్భాటాలు చాలూ…! ప్రజా సమస్యలపై దృష్టి పెట్టేదెప్పొడో …?

సత్యవేడు నియోజకవర్గంలో పేరుకుపోతున్న సమస్యలు – పరిష్కారాల కోసం ప్రజల ఎదురుచూపులు

గరుడధాత్రి :

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నప్పటికీ, సత్యవేడు నియోజకవర్గంలో ఏళ్ళతరబడి పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రజా సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రచార ఆర్భాటాలు, రాజకీయ కార్యక్రమాలకు పరిమితమవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానిక ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న డిమాండ్ ప్రజల వద్ధనుండి వినిపిస్తోంది.

-ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేది ఎప్పుడు?

తమిళనాడు సరిహద్దులో ఉన్న సత్యవేడు పట్టణం మీదుగా భారీ సంఖ్యలో లారీలు, సరుకు రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. కాలినడకన వెళ్లే ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలగుంట నుంచి వీఆర్ కండ్రిక వరకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు సూచిస్తున్నారు.

-దాసుకుప్పం వయా నాగలాపురం బైపాస్ కలేనా..?

దాసుకుప్పం నుంచి నాగలాపురం మండలానికి తమిళనాడు భూభాగంలోకి వెళ్లకుండా నేరుగా చేరుకునే బైపాస్ రహదారి ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ రహదారి నిర్మాణం పూర్తైతే ప్రజల ప్రయాణ సమయం, ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

-అటకెక్కిన సమ్మర్ స్టోరేజ్ ప్రాజెక్టు ఫైళ్లు ..?

వేసవిలో తాగునీటి సమస్య నివారణ కోసం ప్రతిపాదించిన సమ్మర్ స్టోరేజ్ ప్రాజెక్టు అనుమతులు వచ్చినా, తరువాతి దశల్లో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. మంజూరైన నిధుల పరిస్థితి ఏమైందో స్పష్టత లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

-సొంత భవనం లేని డిగ్రీ కళాశాల

సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే కొనసాగుతోంది. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలంటే కళాశాలకు సొంత భవనం నిర్మాణం అత్యవసరమని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
అలాగే లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్టేడియం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురైంది. కోచ్‌లు లేకపోవడం, నిర్వహణ లోపించడంతో క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన మైదానం వ్యసనపరులకు అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

-ప్రారంభానికి నోచుకోని పార్కులు

సత్యవేడు పట్టణంలో ప్రజల వినోదం, ఆరోగ్య అవసరాల కోసం నిర్మించిన పార్కు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు నగరవనం పేరుతో అటవీ శాఖ నిర్మిస్తున్న పార్కు పనులపై కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం.

-శ్రీసిటీ కార్మికుల తప్పని ప్రయాణ కష్టాలు..!

శ్రీసిటీతో పాటు ఇతర పరిశ్రమల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలలో ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. పరిశ్రమలు సిబ్బందికి రవాణా సదుపాయం కల్పించాలని, లేకుంటే ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడపాలని కార్మికులు కోరుతున్నారు.

-దారుణంగా మారిన గ్రామీణ రహదారులు

సత్యవేడు మండలంలోని అనేక గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రైతులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే..
ప్రచార కార్యక్రమాలు, శంకుస్థాపనలు, సభలు నిర్వహించడం కంటే ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. సత్యవేడు అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.