రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వైద్యుడి విషాద మరణం
మాంబట్టు గ్రామంలో విషాద ఛాయలు.. వైద్య రంగానికి తీరని లోటు
నివాళులర్పించిన మాజీ మంత్రి పరసరత్నం
తడ మండలం మాంబట్టు గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మునుస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ప్రాంత ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రజల ఆరోగ్య సంరక్షణనే జీవిత లక్ష్యంగా భావించి సేవలందించిన ఆయన అకాల మరణం వైద్య రంగానికి తీరని లోటుగా మారింది.
డాక్టర్ మునుస్వామి మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రి పరసరత్నం ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ, డాక్టర్ మునుస్వామి సేవలను కొనియాడారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన మంచి వైద్యుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యుడిగా సేవలందించిన డాక్టర్ మునుస్వామి తన ప్రతిభ, నైపుణ్యం, మానవతా దృక్పథంతో వేలాది మంది రోగుల అభిమానాన్ని సంపాదించారు. ఆయనను ప్రజలు కేవలం వైద్యుడిగానే కాకుండా ఆపదలో అండగా నిలిచే వ్యక్తిగా భావించేవారు. నిరుపేదలకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వైద్య సేవలు అందించడంలో ఆయన ముందుండేవారు.
ఆదివారం ఉదయం స్వగ్రామం మాంబట్టులోని దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు హాజరుకావడానికి కారులో బయలుదేరిన డాక్టర్ మునుస్వామి అపాచీ రోడ్డుపై ప్రయాణిస్తుండగా కారు వెనుక టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న వేపచెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న తడ ఎస్సై కొండపనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డాక్టర్ మునుస్వామి మరణవార్త తెలిసిన వెంటనే మాంబట్టు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, ఆయన వద్ద చికిత్స పొందిన రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరించే ఆయన వ్యక్తిత్వం, రోగుల పట్ల చూపిన మానవతా దృక్పథాన్ని పలువురు కన్నీటి పర్యంతమై గుర్తు చేసుకున్నారు.
వైద్య వృత్తిని ఉద్యోగంగా కాకుండా సేవగా భావించిన డాక్టర్ మునుస్వామి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అవసరమైన ప్రతి సందర్భంలో వైద్య సహాయం అందిస్తూ ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారు. తన అంకితభావం, నైపుణ్యంతో వైద్య రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయని స్థానికులు భావోద్వేగంతో పేర్కొన్నారు.
డాక్టర్ మునుస్వామి అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై నివాళులర్పించనున్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం శ్రమించిన ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనివని గ్రామస్తులు కన్నీటి నివాళులు అర్పించారు.