*ప్రజా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం*
*ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే పులివర్తి నాని*
*పుష్ప రెడ్డి ఆహ్వానం మేరకు నేతాజీ నగర్ సందర్శనకు ఎమ్మెల్యే సానుకూల స్పందన*
తిరుపతి రూరల్, ఏప్రిల్ 25: తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీ నాయకులు, అలాగే పార్టీలకు అతీతంగా ప్రజలు తమ ప్రాంతాల సమస్యలు, అభివృద్ధి అవసరాలపై అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఒకే వేదికపై న్యాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా తిరుచానూరుకు చెందిన బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పుష్ప రెడ్డి ఎమ్మెల్యేను కలిసి పంచాయతీకి సంబంధించిన చిన్న సమస్యలను వివరించి, అదేవిధంగా నేతాజీ నగర్ తోపాటు,విజయ గణపతి ఆలయాన్ని సందర్శించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే నేతాజీ నగర్‌తో పాటు ఆలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పుష్ప రెడ్డి మరియు ఆమె భర్త, “టాక్ ఆఫ్ ది టౌన్” పత్రిక అధినేత మునిరామ్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యేను సన్మానించి, పత్రిక మెమెంటోతో పాటు శ్రీ విజయ గణపతి స్వామి క్యాలెండర్‌ను అందజేశారు.
అనంతరం పుష్ప రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టి మొత్తం అభివృద్ధి పనులుపై పెట్టి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
