GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:18 pm Digital Edition : GURU SWAMY

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

* పీజీఆర్‌ఎస్‌లో 82 వినతుల స్వీకరణ.
* కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్.
కుప్పం,ఆగస్టు 03 (గరుడ ధాత్రి న్యూస్):రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా కేంద్రిత పాలనకు అనుగుణంగా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కొనసాగింది. సోమవారం కుప్పం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు రాజు పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
మొత్తం 82 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 35, విద్యాశాఖకు 8, పీ4 కార్యక్రమానికి సంబంధించినవి 6, పోలీస్ శాఖకు 4, ఉపాధి, వ్యవసాయం, ఆర్థిక సహాయం, ప్రజారోగ్యం, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ శాఖలకు చెరో 3, పంచాయతీరాజ్ శాఖకు 2, అలాగే సివిల్ సప్లైస్, ఆర్ అండ్ బీ, పెన్షన్లు, సెర్ప్, గ్రామీణ నీటి సరఫరా , క్రెస్కో, పట్టు పరిశ్రమ, దేవాదాయ, నీటిపారుదల, హౌసింగ్ శాఖలకు సంబంధించిన చెరో ఒక వినతి అందాయి.ఈ సందర్భంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్,మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, శాఖల మధ్య సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.