GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 6:45 pm Posted by : GURU SWAMY

ప్రతి ఇంటిలో బిన్- బ్యాగ్… ప్రతి గ్రామంలో పరిశుభ్రతే లక్ష్యం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29

ప్రభుత్వ ఆదేశాలు సహాయ కమిషనర్ (పంచాయతీ రాజ్) ఇచ్చిన మార్గదర్శకాల మేరకు బైరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో “బిన్ – బ్యాగ్” కార్యక్రమంపై గురువారం అవగాహన సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఎం.పి.డి.ఓ.ఆనంద
భాబు మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, ఆరోగ్యవంతంగా మార్చేందుకు ప్రతి కుటుంబం తప్పనిసరిగా బిన్ – బ్యాగ్ విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటిలో తడి చెత్తను ఒక డబ్బాలో, పొడి చెత్తను ఒక బ్యాగ్‌లో వేర్వేరుగా నిల్వ చేసి గ్రామపంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను రోడ్లపై, కాలువల్లో లేదా ఖాళీ స్థలాల్లో విసరకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ప్రభుత్వం అమలు చేస్తున్న “బిన్ – బ్యాగ్” విధానం ద్వారా గ్రామాలు మరింత పరిశుభ్రంగా మారడంతో పాటు, తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు.
అలాగే ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని, ప్రతి కుటుంబం పరిశుభ్రతను తమ ఇంటి నుంచే ప్రారంభించాలని సూచించారు. వీటి వాడకం వల్ల పశువులు, మూగ జీవాలు వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాయని పేర్కొన్నారు. బజారు కు వెళ్ళడానికి గుడ్డ సంచులు అలవాటు చేసుకోవాలని కోరారు.
దుకాణ దారులు, వీధి వ్యాపారులు, వర్తకులు వారి చెత్తను రోడ్ల పైన ఇష్టారాజ్యంగా పడేస్తే, అట్టి వారికి జరిమానాలు విధించడం తో పాటు వారి వర్తక లైసెన్స్ రద్దు చేయడం కూడా జరుగుతుందని హెచ్చరించారు.
గ్రామ పరిశుభ్రత కార్యక్రమాలకు సహకరించి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేపట్టిన “బిన్ – బ్యాగ్” కార్యక్రమాన్ని విజయవంతం చేసి బైరెడ్డిపల్లి మండలాన్ని ఆదర్శ పరిశుభ్ర మండలంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నరసిం నాగరాజు, పి.డి.ఓ. బైరెడ్డిపల్లి–2, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు.