GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 6:19 pm Posted by : GURU SWAMY

ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్‌లో భాగంగా ప్రత్యేక ఎక్స్‌రే శిబిరం

పిచ్చాటూరు, జూన్ 16 గరుడధాత్రి:
ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక టీబీ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మందికి హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే యంత్రం ద్వారా ఛాతీ ఎక్స్‌రేలు తీశారు.
మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారు, మధుమేహం బాధితులు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, టీబీ రోగులతో సన్నిహిత సంబంధం ఉన్న కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్షలు నిర్వహించారు. తీసిన ఎక్స్‌రేలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా విశ్లేషణ జరిపి, అదే రోజు సాయంత్రంలోపు నివేదికలు అందజేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
పరీక్షల్లో టీబీ లక్షణాలు గుర్తించిన వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు అందించి చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. టీబీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తిగా నిర్మూలించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ ముని చారిత్ర, డాక్టర్ ధనుష్, సామాజిక ఆరోగ్య అధికారి శివయ్య, ఆరోగ్య పర్యవేక్షకులు రాజారావు, వెంకటలక్ష్మమ్మ, టీబీ పర్యవేక్షకులు నవీన్, సుందరమూర్తి, రాజశేఖర్, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.