GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 2:39 pm Digital Edition : GURU SWAMY

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

పిచ్చాటూరు, ఆగస్టు 1 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు ప్రాజెక్ట్ పరిధిలోని రాజానగరం అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్లు కల్పలత, సుమతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హెల్త్ సూపర్వైజర్లు వెంకటలక్ష్మి, రాజారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూపర్వైజర్లు కల్పలత, సుమతి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు తొలి టీకా వంటివని, వాటి ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని వివరించారు. అలాగే తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలనే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం తల్లిపాలు కొనసాగించాలని అవగాహన కల్పించారు.
హెల్త్ సూపర్వైజర్లు వెంకటలక్ష్మి, రాజారావు మాట్లాడుతూ తల్లిపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా ఉంటాయని తెలిపారు. తల్లిపాలు శిశువులను అంటువ్యాధుల నుంచి రక్షించడంతో పాటు మేధో వికాసానికి, శారీరక ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అదే విధంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ప్రసవానంతర సమస్యలు తగ్గడంతో పాటు తల్లి–బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, తల్లులు, అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి, సహాయకురాలు ధరణి, ఆశా కార్యకర్త కుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకరమైన మాతా–శిశు సంరక్షణపై సూచనలు అందించారు.