GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 7:40 pm Posted by : GARUDA DHATRI NEWS

ప్రభుత్వ భూములపై రెవెన్యూ మాయాజాలం?

వంకలకూ పట్టాలు.. ప్రభుత్వ భూములపై రెవెన్యూ మాయాజాలం?

కురబలకోట మండలంలో భారీ భూ అక్రమాలపై ఆరోపణలు

గరుడధాత్రి :

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు… నిబంధనలను తుంగలో తొక్కి అక్రమార్కులకు ధారాదత్తం చేస్తున్నారా? అన్న అనుమానాలు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో పనిచేసిన తహసీల్దార్ భీమేశ్వరరావు హయాంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న భూ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు విస్తుపోతున్నారు.

అంగళ్లు సర్వే నంబర్ 90లో ‘ఎంజాయ్‌మెంట్’ మాయాజాలం

అంగళ్లు గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 90 ప్రభుత్వ రికార్డుల ప్రకారం వంక పోరంబోకు భూమిగా నమోదై ఉంది. సాధారణంగా ఇటువంటి భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అయితే ఆశ్చర్యకరంగా ఈ భూమిని సబ్‌డివిజన్ చేసి కొందరు వ్యక్తులకు అనుకూలంగా ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

– 90/1 – 76 సెంట్లు
– 90/2 – 18 సెంట్లు
– 90/3 – 49 సెంట్లు

మొత్తం 1.43 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు సమాచారం.

అధికారుల సంతకాలతో సర్టిఫికెట్లు

ఈ భూమిని అప్పటి మండల సర్వేయర్ భువనేశ్వరి కొలిచి ధృవీకరించగా, 2024 జనవరి 30న అప్పటి తహసీల్దార్ భీమేశ్వరరావు సంతకం చేసి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. వంక పోరంబోకు భూమికి వ్యక్తిగత హక్కుల ధ్రువీకరణ ఎలా జరిగిందన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రభుత్వ భూమి తిరిగి స్వాధీనం ప్రయత్నం

వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రస్తుత రెవెన్యూ అధికారులు ఆ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే సర్టిఫికెట్లు పొందిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించి, అధికారులపైనే కంటెంప్ట్ పిటిషన్లు దాఖలు చేయడంతో పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారింది.

గోప్యంగా నడిచిన వ్యవహారం

ఈ మొత్తం వ్యవహారం ప్రజలకు, మీడియాకు తెలియకుండా ఫైళ్ల స్థాయిలోనే నడిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు వివాదంగా మారిన తరువాతే విషయం బయటపడటంతో అధికారుల పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

మరిన్ని ప్రభుత్వ భూములపై అక్రమాల ఆరోపణలు

స్థానికుల ఆరోపణల ప్రకారం మండలంలో పలు ప్రభుత్వ భూములు నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తులకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

1. ముదివేడు సర్వే నంబర్ 1630లోని ప్రభుత్వ భూమి.
2. తెట్టు పంచాయతీ అమ్మచెరువు మిట్ట వద్ద సర్వే నంబర్ 859లోని భూమి.
3. కురబలకోట పంచాయతీ సర్వే నంబర్ 1571లోని చుక్కల భూమిలో సుమారు 5 ఎకరాలు కొత్త బైపాస్ రోడ్డుకు ఇరువైపులా అక్రమ లేఅవుట్లుగా మారినట్లు ఆరోపణలు.
4. కాండ్లలమడుగు క్రాస్ సమీపంలోని ఎర్రబెల్లి సచివాలయ పరిధిలో 2.5 ఎకరాల భూమి నిబంధనలకు విరుద్ధంగా ఒక మీడియా ప్రతినిధికి కట్టబెట్టినట్లు, ఇందుకు ప్రతిఫలంగా లక్షల రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

విజిలెన్స్ విచారణకు డిమాండ్

ప్రభుత్వ భూములు, వంకలు, వాగులు, చెరువులు కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా జారీ చేసిన సర్టిఫికెట్లను రద్దు చేసి ప్రభుత్వ భూములను రక్షించాలని రైతులు, స్థానికులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

అంగళ్లు సర్వే నంబర్ 90 వ్యవహారం కేవలం ఒక గ్రామ సమస్య మాత్రమే కాదు… రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న భూ అక్రమాలకు అద్దం పట్టే ఘటనగా మారింది. ప్రభుత్వ భూముల రక్షణపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికర చర్చగా మారింది.