GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 6:25 am Posted by : GARUDA DHATRI NEWS

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నేడు చెన్నైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’కు కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడురమ్’ సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

-కుంగదీసిన కుమారుడి మరణం..
గతేడాదిలో ఆయన తనయుడు, నటుడు మనోజ్‌ భారతీరాజా (48) గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుంగిపోయారు. ఈ విషాదం తర్వాత చాలామంది ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఇటీవల నటి రాధిక కూడా ఆయన్ని కలవగా.. ఆమె నటించిన ‘తాయ్‌కిళవి’కి నేషనల్‌ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. ‘వస్తే మీ పాదాల దగ్గర పెడతాను’ అని ఆమె అన్నారు.