ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రెవెన్యూ శాఖ విధులు..!
శిథిలావస్థలో పెళ్ళకూరు తహసిల్దార్ కార్యాలయం
30 ఏళ్ల నాటి భవనం.. ఎప్పుడు కూలుతుందోనన్న భయం
పెళ్ళకూరు, జూన్ 4 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. సుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం ఎప్పుడు కూలిపోతుందోనన్న ఆందోళన నెలకొంది. కార్యాలయ భవనం పైకప్పు, గోడలు పూర్తిగా దెబ్బతిని పెచ్చులు ఊడిపడుతుండటంతో అధికారులు, సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు.
-నేలబడి విధులు
భవనం ప్రమాదకరంగా మారడంతో తహసిల్దార్ ప్రస్తుతం సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే స్థలం సరిపోకపోవడంతో మిగిలిన రెవెన్యూ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు సిబ్బంది నేలపైనే కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రికార్డు గదులు కూడా శిథిలమై కీలక పత్రాలు ధ్వంసమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
-పాములు, తేళ్లతో సావాసం
భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, గోడలు చీలిపోవడంతో పాములు, తేళ్లు కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నాయి. విషసర్పాల భయంతో ఉద్యోగులు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-స్పందించని పాలకులు
కార్యాలయ దుస్థితిపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ధృవీకరణ పత్రాలు, ఇతర రెవెన్యూ సేవల కోసం వచ్చే ఈ కార్యాలయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమని పేర్కొంటున్నారు.
-కొత్త భవనం నిర్మించాలని డిమాండ్
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెళ్ళకూరు మండలానికి సరికొత్త తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేసి నిర్మించాలని మండల ప్రజలు, రెవెన్యూ సిబ్బంది, అధికారులు కోరుతున్నారు.