ఉద్యోగ భద్రత కల్పించాలి.. సమస్యలను పరిష్కరించాలని జేఏసీ వినతి
నాగలాపురం సెప్టెంబర్ 30 గరుడధాత్రి :
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 19 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఫీల్డ్ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నాగలాపురం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గుణశేఖర్ కు వినతిపత్రం సమర్పించింది.
ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.5,745 మాత్రమే వేతనం అందుతోందని, దీంతో కుటుంబాలను పోషించుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, డివిజన్ స్థాయి బదిలీలు కాకుండా మండల స్థాయి బదిలీలు కల్పించాలని, అర్హత, అనుభవం కలిగిన వారికి పదోన్నతులు ఇవ్వాలని వారు కోరారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులను నివారించి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
మూడు నెలలు పూర్తిచేసిన వారికి F.T.E. వర్తింపజేయాలని, ఉపాధి సిబ్బందికి వర్తింపజేస్తున్న విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా F.T.E. వర్తింపజేయాలని, మ్యాన్ డేస్ విధానం (7,500)ను రద్దు చేయాలని కోరారు.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు అంగవైకల్యం లేదా మరణం సంభవించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు చెల్లించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఏజెన్సీ అలవెన్స్ ఇవ్వాలని, NMMS, Bhuvan తదితర యాప్‌లతో పాటు 5 జీబీ ఇంటర్నెట్ డేటా వినియోగానికి కొత్త మొబైల్ ఫోన్లు అందించాలని కోరారు.
అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు అందించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జయశంకర్, ఏలుమలై, జీవిత, చంద్రశేఖర్,కృష్ణవేణి లు పాల్గొన్నారు.