GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:44 pm Digital Edition : GURU SWAMY

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

కార్వేటినగరం జూలై 31 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం, కత్తెరపల్లె: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెలో ఉపాధ్యాయులుగా సేవలందిస్తూ ఇటీవల నిర్వహించిన హై స్కూల్ ప్లస్ రీ-డిప్లాయ్‌మెంట్‌లో భాగంగా బదిలీపై వెళ్లిన బయాలజీ ఉపాధ్యాయురాలు శ్రీమతి కె. సుప్రసన్న, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు, అలాగే కత్తెరపల్లె క్లస్టర్‌లో సి.ఆర్.ఎం.టి.గా సేవలందించి పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి.ఆర్.సి.కి బదిలీపై వెళ్లిన మీనాక్షిలకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెంగల్‌రాజు మాట్లాడుతూ, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు మరియు సి.ఆర్.ఎం.టి. కత్తెరపల్లె పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా పురోగతికి అందించిన సేవలను కొనియాడారు. వారి సేవలు పాఠశాలకు, ఉపాధ్యాయ బృందానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాఠశాలల్లోనూ అదే అంకితభావంతో పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. అదే సందర్భంగా కత్తెరపల్లె క్లస్టర్‌కు నూతన సి.ఆర్.ఎం.టి.గా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి మహాలక్ష్మికి పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానం చేసి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు మోహన్ మురళి, కత్తెరపల్లె సి.ఆర్.సి. జాయింట్ సెక్రటరీ దొరబాబు, క్లస్టర్ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే ఏపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు శ్రీ కిరణ్, ఎస్‌టీయూ రాష్ట్ర బాధ్యులు యువరాజు తదితరులు పాల్గొని బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల సేవలను అభినందించారు.
తదుపరి జరిగిన సన్మాన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, సి.ఆర్.సి. పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సుప్రసన్న, శ్రీనివాసులు, మీనాక్షిలను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతన సి.ఆర్.ఎం.టి. మహాలక్ష్మిని సన్మానంతో ఆహ్వానించి విజయవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.