GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 12:46 pm Digital Edition : GURU SWAMY

బాధిత కుటుంబాలకు కలెక్టర్ భరోసా

“మీ వెన్నంటే ప్రభుత్వం ఉంది.. ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి”

సత్యవేడు అక్టోబర్ 7 గరుడధాత్రి :

శ్రీ సిటీ పరిధిలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందడంతో విషాదంలో మునిగిన బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అండగా నిలిచారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులతో నేరుగా సమావేశమైన కలెక్టర్.. వారి సాధకబాధకాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు.
“మీ వెన్నంటే ప్రభుత్వం ఉంది. మీకు ఏ అవసరం ఉన్నా నాతో నేరుగా మాట్లాడండి. ఇదిగో నా కార్డు.. ఇందులో నా సెల్‌ఫోన్ నంబర్ ఉంది. ఏ సమస్య వచ్చినా నాకు నేరుగా ఫోన్ చేయండి” అంటూ తన విజిటింగ్ కార్డును బాధిత కుటుంబ సభ్యులకు అందించడం ద్వారా కలెక్టర్ వారికి భరోసా కల్పించారు. కలెక్టర్ అందించిన నంబర్‌కు ఇప్పటికే ఇద్దరు బాధిత కుటుంబ సభ్యులు స్వయంగా ఫోన్ చేసి తమ సమస్యలను వివరించినట్లు సమాచారం.
తమిళనాడుకు చెందిన రమేష్, మోహన్ కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను తమిళనాడు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయిస్తున్నట్లు కలెక్టర్ వారికి వివరించినట్లు తెలిసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంగా ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ తదితర ప్రయోజనాలకు సంబంధించిన నగదును కూడా వారి ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించడంలో జిల్లా కలెక్టర్ తీసుకున్న చొరవను తమిళనాడు రాష్ట్రం గుమ్మిడిపూండి ఎమ్మెల్యే ఎస్. విజయ్‌కుమార్ ప్రశంసించారు.
ఇదే సందర్భంగా బాధిత కుటుంబాల్లోని విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తామని శ్రీ సిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హామీ ఇచ్చారు. పిల్లలు ఎక్కడ, ఏ స్కూల్ లేదా కాలేజీలో చదవాలనుకున్నా విద్యా వసతుల విషయంలో తామే ముందుండి సహకరిస్తామని తెలిపారు. అంతేకాకుండా బాధిత కుటుంబాల పిల్లలతో నేరుగా మాట్లాడి వారి భవిష్యత్తుపై భరోసా కల్పించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని వేగంగా అందించడంతో పాటు, వారి పిల్లల విద్యకు కూడా భరోసా కల్పించే చర్యలు చేపట్టడం పట్ల బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాయి.