పిచ్చాటూరు, జూన్ 18 గరుడధాత్రి :
బాలలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టడం, బాలల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా పిచ్చాటూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వెంగళతూరు ఎం.పీ.పీ. పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్లు సుమతి, బజావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోక్సో (POCSO) చట్టం-2012 గురించి వివరించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అశ్లీల కార్యకలాపాలకు పిల్లలను వినియోగించడం వంటి నేరాల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పోక్సో చట్టంలోని ముఖ్యమైన నిబంధనలను వివరించిన అధికారులు, చట్టంలోని సెక్షన్-4 ప్రకారం లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు కనీసం 7 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాలలు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
అంతేకాకుండా బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పాఠశాలలు, తల్లిదండ్రులు, సమాజం కలిసి పిల్లలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మణికంఠ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు జ్యోతి, రూత్ మేరీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.