GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:04 pm Digital Edition : GURU SWAMY

బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష

చౌడేపల్లి ఆగస్టు 03 గరుడ దాత్రి న్యూస్

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తల్లిపాల వారోత్సవాలు’ చౌడేపల్లి, పుదిపట్ల గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు సులోచన, రాధమ్మలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన అరగంట లోపు తల్లీబిడ్డలకు స్పర్శను కల్పిస్తూ తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువు పాలిట అమృతంతో సమానమని, అవి బిడ్డకు తొలి టీకాగా పనిచేసి జీవితాంతం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని వివరించారు.
పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అప్పుడే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని స్పష్టం చేశారు. బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు తల్లిపాలలోనే పుష్కలంగా ఉంటాయి. బయటి పాలు, డబ్బా పాలు వాడటం వల్ల పిల్లలు తరచూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లులు కూడా బ్రెస్ట్ క్యాన్సర్, ఒబేసిటీ లాంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని అవగాహన కల్పించారు. ముర్రుపాలు పారబోయకూడదని, అపోహలు విడనాడి ప్రతి తల్లీ తప్పనిసరిగా బిడ్డకు పాలివ్వడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యవంతమైన నవసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూపర్‌వైజర్లు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు మరియు పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.