GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:44 am Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లిలో నేడు 82 పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు

బైరెడ్డిపల్లి, గరుడధాత్రి, సెప్టెంబర్ 28:

బైరెడ్డిపల్లి మండలంలోని 82 పాఠశాలల్లో నేడు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు జనార్దన్‌రెడ్డి, దేశమ్మ తెలిపారు.
మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, గురుకుల పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్‌లలోనూ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియను మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్, ఎస్‌ఐతో పాటు మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత తీసుకోవాలని అధికారులు సూచించారు.
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఓటర్లుగా ఎన్నికల ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని ఎస్‌ఎంసీ ఎన్నికలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు సూచించారు.